Wednesday, December 30, 2009

కొత్త కొత్తగా

ఇవాల్టి నుంచీ కొత్తగా మొదలవుదాం
నిన్నటికి కొనసాగింపుగా కాక
ఈ రొజే మొగ్గ తొడుగుతున్నట్లుగా
తాజా తాజాగా
పరిమళ భరితంగా
పాపాయి
లేలేత చేతుల్లోని
అరవిచ్చిన బోసి నవ్వుల్లోని
మృదువైన స్పర్శ లాగా
కొత్త కొత్తగా మొదలవుదాం
మాటలు పాతవే కావచ్చు
సంభాషణలు సరికొత్తగా
మొదలుపెట్టుకోవచ్చు
చూపులు అవే కావచ్చు
సరికొత్త దృశ్యాల్ని ఆవిష్కరిద్దాం
రంగులు రుచులు ముఖాలు
అన్నీ పాత పాతగానే వుండొచ్చు
ఒకసారి ప్రయత్నిస్తే
ఏదో ఒక కొత్తదనం దొరక్క పోదు
ఈ రోజు రేపటికి పాతదైనా
ఈ వసంతం
చివరాఖరికి పులిసిపోయినా
ఈ రోజును మాత్రం
కొత్తగానే మొదలు పెడదాం
ఏమో
ఏ తేనెటీగ
మనలోని మకరంద బిందువుల్ని
ఒక చోటుకు చేర్చుతుందో
ఏ మంచు బిందువు
మన పెదవులపై
సూర్యోదయ కాంతిలో
తళుక్కుమంటుందో
ఏ దేహపు చిగురు వర్ణం
ఎన్ని కాంతులీనుతుందో
ప్రారంభిస్తేనే కదా తెలిసేది
కొత్తదనపు రుచి
ఎప్పుడూ
క్షణం తర్వాతి క్షణం
కొత్తదే
ప్రతి క్షణం
సరికొత్తగా ప్రారంభించడానికి
ఈ రోజే మొదలు పెడదాం
కొత్త కాలపు సువాసనల్ని శ్వాసిద్దాం
నిన్నటి దు:ఖాల్నీ దిగుళ్లనీ
మంటల్లో వేసి
నేటి వేకువ ఝామున
నులివెచ్చగా చలి కాగుదాం
ఇవాల్టి నుంచీ కొత్త కొత్తగా మొదలవుదాం

Friday, December 4, 2009

మౌన విస్ఫోటనాలు

ఎవరి కారణాలు వారికుంటాయి
మాట్లాడటానికి మాట్లాడక పోవడానికి
మాట్లాడేవాడికి
మాట్లాడటానికి
ఎన్ని కారాణాలుంటాయో
మాట్లాడని వాడికి
మాట్లాడక పోవడానికి
అన్ని కారణాలుంటాయి
మాట ధిక్కారమైతే
మౌన అంగీకారమవు తున్నది
ధిక్కార స్వరాలలోని సాధికారికత
మౌన వ్రతాల్లోనూ ఉంటుంది
తల వంచినంత మాత్రాన
కళ్లు నేల దిక్కు తిరిగినంత మాత్రాన
ఆ కళ్లల్లో అగ్ని వర్షించదని
ఎలా అనుకొంటాం
మాటకు మాటకు మధ్య
రగిలే ఘర్షణలో
దేహాలు దగ్దమవుతుంటాయి
మౌనమూ మనసును కాల్చేస్తుంది
ఒక చోటో మరొక చోటో
గోడలు కూలి
ప్రవాహాలు కలిసి పోతుంటే
మాటకు మౌనానికి మధ్య
గోడలు నిర్మించడానికి
జరుగుతున్న పోరాటాల్లో
సరిహద్దులు తగలబడి పోతున్నయి
సురక్షిత వలయాల్లో
సుహృద్భావ వాతావరణాల్లో
గ్లాసులు ఛీర్స్ చెప్పుకుంటూనే ఉన్నాయి
నిజం చెప్పులేసుకొనే లోపే
అబద్దం లోకం చుట్టి వస్తోంది
మాటకు మౌనానికి మధ్య
నిరంతర ఘర్షణ
పేలుతున్న మాటల మధ్య
మౌన విస్ఫోటనాలకై ఎదురు చూపు
వ్యూహాలు నిర్వీర్య మవుతున్న తరుణం లో
సరి కొత్త మార్గాన్వేషణ
రంగి వెలిసిన మాస్క్ ల్లోంచి
కొంచెం పాతబడని దాని కోసం వెతుకులాట
మౌనం లోలోపల ఎగసిపడే ఉప్పెన
మాట చల్లారినంత తొందరగా
మౌనం చల్లారదు