Sunday, September 9, 2018


యుద్ధవర్షం

ఒక అసంకల్పిత యుద్ధానికి వారసుడ్నయ్యాను
యుద్ధం మొదలవ్వడం కంటే ముందే
ఆయుధ వలయంలో చిక్కుకున్నాను
రగులుతున్న ప్రతీకారేచ్చలో తగలబడుతూనే
కొత్త సూర్యోదయాన్నికలగంటున్నాను
అనాహ్వానిత నిర్బంధపుటంచులకు వేలాడుతూ
శిశిరోదయాల్ని ధ్వంసం చేస్తున్నాను
వాడు ఆయుధాల రంగులు మార్చినప్పుడల్లా
నా పక్కటెముకల్లోంచి కొత్త ఆయుధాల్ని సృష్టిస్తున్నాను
జీవితాన్ని రణరంగం గా మార్చి
నిరంతరం యుద్ధవర్షాన్ని కురిపిస్తున్నాడు
వాడి జండా ఎజెండా ఎప్పుడూ ఒక్క వర్ణమే
నా ముందు మాత్రం సప్తవర్ణ సమ్మిశ్రిత మాటల్ని పరుస్తుంటాడు
సందర్భం ఏదైనా కావచ్చు
ఎక్కడో ఒకచోట, తుపాకీ పేలిన శబ్దం
నన్ను నిర్వీర్యుడ్ని చేస్తుంది
యుద్ధం కాంక్ష అయిన చోట
నాలుగురోడ్ల కూడలిలో నిలబడిఉన్నాను
నిత్య యుద్ధ వాతావరణంలో
ఆకలి వాడికి కేక వాడికి వికృతక్రీడ
తాత్కాలిక ఓటమిని ఎదుర్కొంటున్న నాకు
గెలుపు శిఖరాలనుండి
జారిపోతున్న వాడి ముఖం
స్పష్టంగా కనిపిస్తూనే ఉంది  
పతనపు రహదారుల్లో ఎగురుతున్నవాడు
నేలను తాకినప్పుడే నన్నూ తాకగలడు
వాడిని గాల్లోనే అంతం చెయ్యడమే
ఎదురుగా నిలిచిన లక్ష్యం
***   ***   ***

Tuesday, September 24, 2013

ముచ్చబోడు


ఊరికి దక్షిణంగా ముచ్చబోడు
పచ్చ పచ్చగా నల్లనల్లగా
మధ్యలో చిన్న చెలమలో స్వచ్చమైన నీళ్లతో
ముచ్చబోడుమీద మేఘం వాలిందా
వాన కురవాల్సిందే
అక్కడ కురిసిన వాన
నా చేను దేహాన్ని తడిపి
నాలుగు మొక్కలై
చారెడు గింజలై
నన్నూ నాఇంటిని
నిరంతరం ప్రవహింపజేస్తుంది
అక్కడ మొలిచిన గడ్డి
నా గేదెల పాలపొదుగుల్లోకి దూరి
నాకూ నా పిల్లలకూ ఇంత జీవాన్నిస్తుంది

ఇప్పుడక్కడ
బోడు మాయమైంది
కొండ దేహమంతా పగిలి
తెల్లని గాయాలు గాయాలుగా....
ఇప్పుడక్కడ మబ్బులు కమ్మడలేదు
వానలు కురవడం లేదు

అది ఇప్పుడు నిలువునా కరిగి
నాపాదాలకూ నా నేలకూ మధ్య
రోడ్లు రోడ్లుగా విస్తరిస్తున్నది

ఆకలిని తడపాల్సిన వానకూ
నేలకూ మధ్య
పొరలు పొరలుగా పరుచుకొంటున్నది

పగిలిన రాళ్ల మధ్యనుండి
పొడుచుకొచ్చిన గడ్డిపరకలు
గేదెల ఆకలి తీర్చడం లేదు

నిన్నటిదాకా నిలిచిన
ఒక జీవన ఉనికి
కంకరయంత్రాల శబ్దాలమధ్య
రాతి దుమ్ములో కలిసిపోయింది

***   ***  ***

Tuesday, September 3, 2013

 పాద జాడల కోసం
                                                                                                            


కొన్ని నిర్నిద్ర రాత్రుల అనంతరం
ఒక వేకువ నాటి
కన్రెప్పలలో చిప్పిల్లిన
రెండు కన్నీటి బిందువుల సాక్షిగా
ఒకానొక కూడలిలో నిలబడి
కొన్ని పాదాలు వదిలిన
జాడల కోసం అన్వేషిస్తూ
             ***
నిలువెత్తు మొలిచిన గోడల్ని దాటి
చిద్ర దేహాన్ని ఈడ్చుకొంటూ
ఎవరిలోకో చొచ్చుకుపోవాలనే
వ్యర్ధప్రయత్నంతో
పునః పునః దేహాన్ని కూడేసుకుంటూ
అదే పాదాల జాడల కోసం
            ***
గుర్తుపట్టాల్సిన గొంతుల్లో
జొరబడిన కీచురాళ్ళ శబ్దాల మధ్య
నన్ను అన్వేషించే
నన్ను ఎలుగెత్తి పిలిచే
దారి చూపించే గొంతు కోసం
గొంతులు నడిచెళ్లిన
పాదాల జాడల కోసం
             ***
మార్గాల్ని దర్శించే క్రమంలో
చీలిన వ్యక్తిత్వాల వేళ్ల చివర్లలో 
వేలిని పట్టుకోవాలో
వేలిని వదిలేయలో
అనుసరించాల్సిన అడుగు ఏదో
వదిలేయాల్సిన అడుగు ఏదో
మళ్లీ అదే పాద జాడల కోసం
               ***
జారిపోతున్న నన్ను పట్టుకొని నిలబెట్టేందుకు
జీవన వైతరణిని
ఒక్క ఊపులో లంఘించేందుకు
అలుక్కుపోయిన పాదముద్రలలో
అనుసరించాల్సిన పాదాల జాడల కోసం
                  ***
చిరుగాలి మాత్రానికే
కాలిముద్రలు చెరిగిపోయాక
కుడి ఎడమల
ముందు వెనుకల
ఎవరూ లేని ఎడారిలో ఒంటరిగా
ఆది అన్వేషణను కొనసాగిస్తూ...

             &&&

Friday, July 19, 2013

ఆమె లేదు



అంతే కదా!
మృత్యువుతో యుద్ధం చేసి
ఎవరు మాత్రం గెలవగలరు
ఒక దశాబ్దకాలపు
సుదీర్ఘ యుద్ధం 
ఈ రొజే ముగిసింది
పోరాడి పోరాడి అలసిపోయిన చిన్నమ్మ
ఇప్పుడు ప్రశాంత వదనంతో నిద్రపోతోంది
ఆ నిద్ర వెనుక 
ఎన్ని ఆరాటాలో ఎన్నిపోరాటాలో
ఎన్నీ సంతోషాలో ఎన్ని దుఃఖాలో  
ఎన్ని వేదనలో ఎన్ని శోధనలో
ఇప్పుడన్నింటికి శాశ్వత విరామం
ఆమె జీవితంతో చేసిన సమరం కంటే
దేహంతో చేసిన సమరమే ఎక్కువ
మరణం -  ఓడిన ప్రతిసారీ 
అంతిమ విజయం తనదేనన్న పట్టుదలతో
తిరిగి తిరిగి దాడి చేసేది
ఆమె ఇప్పుడు శాశ్వతనిద్రలోకి వెళ్లింది
ఆమెను వేదించిన, శాసించిన రాచపుండు
ఆమెతోబాటే నిద్రపోతోంది
ఓ అరవై యేళ్ల  జీవన ప్రయాణంలో 
ఆమెకెదురైన పూలూ ముళ్లూ
రాళ్లూ రప్పలూ చెట్లూ చేమలూ
ఇంటిముందు పరుచుకొన్న నిద్రగన్నేరు మొదలు నిమ్మ చెట్టువరకూ  
ఆమె వెళుతున్న చివరి మజిలీ దారిపొడుగునా నిలిచి
ఆమెకూ వీడ్కోలు పలుకుతున్నాయి
అందర్నీ ఒకే విధంగా ప్రేమించిన 
ఆమె చేతి స్పర్శలోని 
ఆమె పెట్టిన గోరుముద్దల్లోని 
ఆమె చెప్పిన మాటల్లోని ఆనవాళ్లు 
నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి
ఆమె వెళ్లిపోయిన తరువాత 
ఇన్నాళ్లూ తనతో నడిచిన కాళ్లూ 
తనకు చేయూతనిచ్చిన చేతులూ 
నిర్జీవాలైపోయాక
ఆయన అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు
ఆమె వున్నప్పుడు అన్నింటికి ఆమెపై ఆధారపడ్డ ఆయనకు
మాటల భరోసా తప్ప ఆమెను ఇవ్వలేం కదా
ఆమె జ్ఞాపకాల్లోని కొన్ని స్పర్శల్ని 
మాచేతుల్లోకి తీసుకొని ఆయనకు అద్దాలి
ఎప్పటికీ ఆయనకు వెలుగునివ్వకపోయినా
ఎన్నోకొన్ని పగటి ముక్కల్ని ఆయనకు అంటించాలి
ఆమె జ్ఞాపకాలతోపాటు ఆయననూ పొదవిపట్టుకోవాలి
888  ***  888

అచేతనత్వం



ఒక సుదీర్ఘ విరామం తరువాత
మృత్యువు మా ఇంటి పరిసరాల్లో తచ్చాడుతోంది
ఇంటి చుట్టూ ఎన్ని లక్ష్మణరేఖలు గీసినా
వాకొట్లోంచో కిటికీ లోంచో
తొంగి తొంగి చూస్తూనే ఉంది
***
అమ్మ
అమ్మ తరువాత అమ్మ
చిన్నమ్మ నన్ను పెంచిన నా తల్లి
ఇప్పుడు మృత్యువుతో భీకర యుద్ధం చేస్తోంది 
ఎన్ని అస్త్ర శస్త్రాల్ని అందించినా 
పోరాడి పోరాడి అలసిపోయి
నిస్తేజంగా అలా  మంచం మీద పరుండి పోయింది
***
బిడ్డల్ని మోయాల్సిన  ఆమె గర్భసంచి 
ఇప్పుడొక రాచపుండును మోస్తోంది
నిర్మూలించాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా
రావణాసురుని తలల్లా 
తిరిగి తిరిగి తలలెత్తుతూనే ఉంది
***
అమ్మా!
బిడ్డలు లోపల కదలాడుతుంటే 
కలిగే సంతోషాన్ని అందుకోలేని నువ్వు
ఇప్పుడీ రాచపుండు కదులుతుంటే 
ఎంత వేదనననుభవిస్తున్నావో కదా!
నీ లోపలి రక్తం 
నీళ్లలా మారుతున్న దృశ్యం  
అది లోలోపల సృష్టిస్తున్న దావానలం
ఎలా భరిస్తున్నావో కదా!
మేమెక్కడ బాధపడతామోనని 
లుంగలు చుట్టుకుపోతున్న వేదనను
పళ్ల బిగువున ఎలా ఆపుకొంటున్నావు
ఎప్పుడూ  నీ గురించే దిగులుపడ్డ 
అమ్మమ్మ దిగులును నిజం చేస్తూ 
నిరంతరం నువ్వు పోరాటం చేస్తూనే ఉన్నావు కదా!
***
ఒక సుదీర్ఘ జీవనయానపు సారం 
దృశ్య దృశ్యాలుగా కళ్లముందు కదలాడుతుంటే
పొందినవేంటో పోగొట్టుకొన్నవేంటో 
సమీక్షించుకొంటూ 
కనుకొలుకుల్నించి
నువ్వు రాల్చుతున్న కన్నీటి బిందువుల్ని 
దోసిలిలో పట్టి
వాటికి మా కన్నీటీ బిందువుల్ని 
జతచేయడం తప్ప
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము
నువ్వు మొక్కే దేవుళ్లలో 
ఎవరైనా కరుణించి 
నీ అవిశ్రాంత వేదనను మాకు పంచితే ఎంత బాగుండు.
*** *** ***

Friday, January 25, 2013

శిధిలాల నుండి శిఖరాల దాకా


నడుస్తూ నడుస్తూనే
నేనొక అద్భుత నిర్మాణాన్ని కలగంటాను
ఒక శాశ్వత నిర్మాణాన్ని
అందులో రెక్కలల్లార్చుకుంటూ తిరిగే
రంగు రంగుల సీతాకోకచిలుకల్నీ
పాలకంకుల గింజల్ని 
పొడుచుకు తినే పిచుకల్నీ 
చిన చిన్న మాటల్ని వల్లెవేసే చిలికల్నీ
మెత్తమెత్తని అడుగుల్తో
కువకువలాడుతూ తిరిగే తెల్లని కుందేళ్లనీ 
ఇంకా జింకల్నీ, లేళ్లనీ ,నెమళ్లనీ ఎన్నెన్నింటినో కలగన్నాను
చల్లని వేకువ లాంటి కల    
అలా కల కంటూ వుండగానే 
హఠాత్తుగా ఒక విద్రోహం
ఉవ్వెత్తున ఎగసి విరుచుకుపడింది
చిద్ర శకలాల్లోంచి 
నన్ను నేను ప్రోది చేసుకొని చూస్తే 
అక్కడ
నిర్మాణానికి రాళ్లందించిన చేతులే
పునాదుల్తో సహా నన్ను పెళ్లగించి వేస్తున్నాయి
ఇటుక మీద ఇటుక పేర్చినవాడే
స్వార్ధ ఆయుధాలతో నన్ను నిలువునా కూల్చేస్తున్నాడు 
సుందర నిర్మాణపు ఆకృతి 
శిధిలాలుగా రాలి పడుతోంది
గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన
దేహసమూహాల్లోంచి
మరో కొత్తకలను నిర్మించాలి
కొన్నో మరికొన్నో విశ్వాసాల ఊడల్ని పట్టుకొని
రేపటి లోకపు ఆకాశం దాకా
ఉయ్యాలలూగాలి ఉయ్యాలలూగాలి.
&&&

Wednesday, August 10, 2011

'మో' కి

అట్లా అని
బాధ లేకుండా ఎలా ఉంటుంది
ఆదివారం సాయంత్రమేగా
విశ్వేశ్వరరావు@60 సందర్భంలో కలిసాం
తాజా తాజాగా
రవీంద్రభారతి పరిమళాల్ని
పునరాస్వాదించాం
ఇటీవలే చదివిన
గ్రీకువో లాటిన్ వో
నాలుగు కవితల్లోని వాక్యాల్ని
మాముందు కుమ్మరించి
మా దేహతీరాల్లో
మా దేహ తీరాల్లో
వాటి సుగంధాలను నాటావు
అట్లా అని
బాధ లేకుండా ఎలా ఉంటుంది
అప్పుడేమో
నువ్వు బతికిన క్షణాల్లో
సాంధ్యభాషను లిఖిస్తూ
వెన్నెల నీడల్ని మాముందు పరిచావు
ఇప్పుడేమో
రహస్తంత్రి ని మీటుకుంటూ
నీడలూ జాడలూ వెతుక్కుంటు వెళ్లిపోయావు
మృత్యువంటే
పక్కకు వత్తిగిల్లడమేనని
ఎప్పుడో అన్నావే
జీవితపు కొన్ని అంకాల్ని మాకే అంకితమిచ్చి
కొన్ని స్పష్టాస్పష్ట సందర్భాల మధ్య
విశ్రాంతిగా నడుం వాల్చావు గదా
మమ్మల్ని జీవనభ్రాంతి లో ఉంచి
అలా ఎలా వెళ్లావు
అంతేలే
ఎవరికెంత దిగులుగా ఉన్నా
నువ్వు వెళ్లిపోయిన తరువాత
ఈ దునియా మునిగిపోలేదులే
కాకుంటే
నిన్ను వెంటాడుతున్న కొన్ని కళ్లు
జోగుతూనో
మత్తుగానో
గమ్మత్తుగానో
నీ అక్షరాల చివరల్ని పట్టుకొని ఊగుతున్నాయి
మరికొన్ని జీవితాలు
నీ దేహశకలాల్ని పట్టుకొని ఊగుతున్నాయి