Friday, July 19, 2013

ఆమె లేదు



అంతే కదా!
మృత్యువుతో యుద్ధం చేసి
ఎవరు మాత్రం గెలవగలరు
ఒక దశాబ్దకాలపు
సుదీర్ఘ యుద్ధం 
ఈ రొజే ముగిసింది
పోరాడి పోరాడి అలసిపోయిన చిన్నమ్మ
ఇప్పుడు ప్రశాంత వదనంతో నిద్రపోతోంది
ఆ నిద్ర వెనుక 
ఎన్ని ఆరాటాలో ఎన్నిపోరాటాలో
ఎన్నీ సంతోషాలో ఎన్ని దుఃఖాలో  
ఎన్ని వేదనలో ఎన్ని శోధనలో
ఇప్పుడన్నింటికి శాశ్వత విరామం
ఆమె జీవితంతో చేసిన సమరం కంటే
దేహంతో చేసిన సమరమే ఎక్కువ
మరణం -  ఓడిన ప్రతిసారీ 
అంతిమ విజయం తనదేనన్న పట్టుదలతో
తిరిగి తిరిగి దాడి చేసేది
ఆమె ఇప్పుడు శాశ్వతనిద్రలోకి వెళ్లింది
ఆమెను వేదించిన, శాసించిన రాచపుండు
ఆమెతోబాటే నిద్రపోతోంది
ఓ అరవై యేళ్ల  జీవన ప్రయాణంలో 
ఆమెకెదురైన పూలూ ముళ్లూ
రాళ్లూ రప్పలూ చెట్లూ చేమలూ
ఇంటిముందు పరుచుకొన్న నిద్రగన్నేరు మొదలు నిమ్మ చెట్టువరకూ  
ఆమె వెళుతున్న చివరి మజిలీ దారిపొడుగునా నిలిచి
ఆమెకూ వీడ్కోలు పలుకుతున్నాయి
అందర్నీ ఒకే విధంగా ప్రేమించిన 
ఆమె చేతి స్పర్శలోని 
ఆమె పెట్టిన గోరుముద్దల్లోని 
ఆమె చెప్పిన మాటల్లోని ఆనవాళ్లు 
నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి
ఆమె వెళ్లిపోయిన తరువాత 
ఇన్నాళ్లూ తనతో నడిచిన కాళ్లూ 
తనకు చేయూతనిచ్చిన చేతులూ 
నిర్జీవాలైపోయాక
ఆయన అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు
ఆమె వున్నప్పుడు అన్నింటికి ఆమెపై ఆధారపడ్డ ఆయనకు
మాటల భరోసా తప్ప ఆమెను ఇవ్వలేం కదా
ఆమె జ్ఞాపకాల్లోని కొన్ని స్పర్శల్ని 
మాచేతుల్లోకి తీసుకొని ఆయనకు అద్దాలి
ఎప్పటికీ ఆయనకు వెలుగునివ్వకపోయినా
ఎన్నోకొన్ని పగటి ముక్కల్ని ఆయనకు అంటించాలి
ఆమె జ్ఞాపకాలతోపాటు ఆయననూ పొదవిపట్టుకోవాలి
888  ***  888

అచేతనత్వం



ఒక సుదీర్ఘ విరామం తరువాత
మృత్యువు మా ఇంటి పరిసరాల్లో తచ్చాడుతోంది
ఇంటి చుట్టూ ఎన్ని లక్ష్మణరేఖలు గీసినా
వాకొట్లోంచో కిటికీ లోంచో
తొంగి తొంగి చూస్తూనే ఉంది
***
అమ్మ
అమ్మ తరువాత అమ్మ
చిన్నమ్మ నన్ను పెంచిన నా తల్లి
ఇప్పుడు మృత్యువుతో భీకర యుద్ధం చేస్తోంది 
ఎన్ని అస్త్ర శస్త్రాల్ని అందించినా 
పోరాడి పోరాడి అలసిపోయి
నిస్తేజంగా అలా  మంచం మీద పరుండి పోయింది
***
బిడ్డల్ని మోయాల్సిన  ఆమె గర్భసంచి 
ఇప్పుడొక రాచపుండును మోస్తోంది
నిర్మూలించాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా
రావణాసురుని తలల్లా 
తిరిగి తిరిగి తలలెత్తుతూనే ఉంది
***
అమ్మా!
బిడ్డలు లోపల కదలాడుతుంటే 
కలిగే సంతోషాన్ని అందుకోలేని నువ్వు
ఇప్పుడీ రాచపుండు కదులుతుంటే 
ఎంత వేదనననుభవిస్తున్నావో కదా!
నీ లోపలి రక్తం 
నీళ్లలా మారుతున్న దృశ్యం  
అది లోలోపల సృష్టిస్తున్న దావానలం
ఎలా భరిస్తున్నావో కదా!
మేమెక్కడ బాధపడతామోనని 
లుంగలు చుట్టుకుపోతున్న వేదనను
పళ్ల బిగువున ఎలా ఆపుకొంటున్నావు
ఎప్పుడూ  నీ గురించే దిగులుపడ్డ 
అమ్మమ్మ దిగులును నిజం చేస్తూ 
నిరంతరం నువ్వు పోరాటం చేస్తూనే ఉన్నావు కదా!
***
ఒక సుదీర్ఘ జీవనయానపు సారం 
దృశ్య దృశ్యాలుగా కళ్లముందు కదలాడుతుంటే
పొందినవేంటో పోగొట్టుకొన్నవేంటో 
సమీక్షించుకొంటూ 
కనుకొలుకుల్నించి
నువ్వు రాల్చుతున్న కన్నీటి బిందువుల్ని 
దోసిలిలో పట్టి
వాటికి మా కన్నీటీ బిందువుల్ని 
జతచేయడం తప్ప
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము
నువ్వు మొక్కే దేవుళ్లలో 
ఎవరైనా కరుణించి 
నీ అవిశ్రాంత వేదనను మాకు పంచితే ఎంత బాగుండు.
*** *** ***