ముచ్చబోడు
ఊరికి
దక్షిణంగా ముచ్చబోడు
పచ్చ
పచ్చగా నల్లనల్లగా
మధ్యలో
చిన్న చెలమలో స్వచ్చమైన నీళ్లతో
ముచ్చబోడుమీద
మేఘం వాలిందా
వాన
కురవాల్సిందే
అక్కడ
కురిసిన వాన
నా
చేను దేహాన్ని తడిపి
నాలుగు
మొక్కలై
చారెడు
గింజలై
నన్నూ
నాఇంటిని
నిరంతరం
ప్రవహింపజేస్తుంది
అక్కడ
మొలిచిన గడ్డి
నా
గేదెల పాలపొదుగుల్లోకి దూరి
నాకూ
నా పిల్లలకూ ఇంత జీవాన్నిస్తుంది
ఇప్పుడక్కడ
బోడు
మాయమైంది
కొండ
దేహమంతా పగిలి
తెల్లని
గాయాలు గాయాలుగా....
ఇప్పుడక్కడ
మబ్బులు కమ్మడలేదు
వానలు
కురవడం లేదు
అది
ఇప్పుడు నిలువునా కరిగి
నాపాదాలకూ
నా నేలకూ మధ్య
రోడ్లు
రోడ్లుగా విస్తరిస్తున్నది
ఆకలిని
తడపాల్సిన వానకూ
నేలకూ
మధ్య
పొరలు
పొరలుగా పరుచుకొంటున్నది
పగిలిన
రాళ్ల మధ్యనుండి
పొడుచుకొచ్చిన
గడ్డిపరకలు
గేదెల
ఆకలి తీర్చడం లేదు
నిన్నటిదాకా
నిలిచిన
ఒక
జీవన ఉనికి
కంకరయంత్రాల
శబ్దాలమధ్య
రాతి
దుమ్ములో కలిసిపోయింది
*** *** ***