Wednesday, December 30, 2009

కొత్త కొత్తగా

ఇవాల్టి నుంచీ కొత్తగా మొదలవుదాం
నిన్నటికి కొనసాగింపుగా కాక
ఈ రొజే మొగ్గ తొడుగుతున్నట్లుగా
తాజా తాజాగా
పరిమళ భరితంగా
పాపాయి
లేలేత చేతుల్లోని
అరవిచ్చిన బోసి నవ్వుల్లోని
మృదువైన స్పర్శ లాగా
కొత్త కొత్తగా మొదలవుదాం
మాటలు పాతవే కావచ్చు
సంభాషణలు సరికొత్తగా
మొదలుపెట్టుకోవచ్చు
చూపులు అవే కావచ్చు
సరికొత్త దృశ్యాల్ని ఆవిష్కరిద్దాం
రంగులు రుచులు ముఖాలు
అన్నీ పాత పాతగానే వుండొచ్చు
ఒకసారి ప్రయత్నిస్తే
ఏదో ఒక కొత్తదనం దొరక్క పోదు
ఈ రోజు రేపటికి పాతదైనా
ఈ వసంతం
చివరాఖరికి పులిసిపోయినా
ఈ రోజును మాత్రం
కొత్తగానే మొదలు పెడదాం
ఏమో
ఏ తేనెటీగ
మనలోని మకరంద బిందువుల్ని
ఒక చోటుకు చేర్చుతుందో
ఏ మంచు బిందువు
మన పెదవులపై
సూర్యోదయ కాంతిలో
తళుక్కుమంటుందో
ఏ దేహపు చిగురు వర్ణం
ఎన్ని కాంతులీనుతుందో
ప్రారంభిస్తేనే కదా తెలిసేది
కొత్తదనపు రుచి
ఎప్పుడూ
క్షణం తర్వాతి క్షణం
కొత్తదే
ప్రతి క్షణం
సరికొత్తగా ప్రారంభించడానికి
ఈ రోజే మొదలు పెడదాం
కొత్త కాలపు సువాసనల్ని శ్వాసిద్దాం
నిన్నటి దు:ఖాల్నీ దిగుళ్లనీ
మంటల్లో వేసి
నేటి వేకువ ఝామున
నులివెచ్చగా చలి కాగుదాం
ఇవాల్టి నుంచీ కొత్త కొత్తగా మొదలవుదాం

Friday, December 4, 2009

మౌన విస్ఫోటనాలు

ఎవరి కారణాలు వారికుంటాయి
మాట్లాడటానికి మాట్లాడక పోవడానికి
మాట్లాడేవాడికి
మాట్లాడటానికి
ఎన్ని కారాణాలుంటాయో
మాట్లాడని వాడికి
మాట్లాడక పోవడానికి
అన్ని కారణాలుంటాయి
మాట ధిక్కారమైతే
మౌన అంగీకారమవు తున్నది
ధిక్కార స్వరాలలోని సాధికారికత
మౌన వ్రతాల్లోనూ ఉంటుంది
తల వంచినంత మాత్రాన
కళ్లు నేల దిక్కు తిరిగినంత మాత్రాన
ఆ కళ్లల్లో అగ్ని వర్షించదని
ఎలా అనుకొంటాం
మాటకు మాటకు మధ్య
రగిలే ఘర్షణలో
దేహాలు దగ్దమవుతుంటాయి
మౌనమూ మనసును కాల్చేస్తుంది
ఒక చోటో మరొక చోటో
గోడలు కూలి
ప్రవాహాలు కలిసి పోతుంటే
మాటకు మౌనానికి మధ్య
గోడలు నిర్మించడానికి
జరుగుతున్న పోరాటాల్లో
సరిహద్దులు తగలబడి పోతున్నయి
సురక్షిత వలయాల్లో
సుహృద్భావ వాతావరణాల్లో
గ్లాసులు ఛీర్స్ చెప్పుకుంటూనే ఉన్నాయి
నిజం చెప్పులేసుకొనే లోపే
అబద్దం లోకం చుట్టి వస్తోంది
మాటకు మౌనానికి మధ్య
నిరంతర ఘర్షణ
పేలుతున్న మాటల మధ్య
మౌన విస్ఫోటనాలకై ఎదురు చూపు
వ్యూహాలు నిర్వీర్య మవుతున్న తరుణం లో
సరి కొత్త మార్గాన్వేషణ
రంగి వెలిసిన మాస్క్ ల్లోంచి
కొంచెం పాతబడని దాని కోసం వెతుకులాట
మౌనం లోలోపల ఎగసిపడే ఉప్పెన
మాట చల్లారినంత తొందరగా
మౌనం చల్లారదు

Tuesday, November 24, 2009

మట్టి ముడుచు కొంటోంది


మట్టి - పంట
మట్టి - బువ్వ
మట్టి - జీవితం
ఇప్పుడు
మట్టిని కౌగలించుకొంటే
దు:ఖం రాలుతోంది
నిన్నటి దాకా
గజాల లెక్కన
డబ్బైన మట్టి
నేడు డోక్కల్లో ముడుచుకొని
దీనంగా చూస్తోంది
అందినంతమేరా
కాళ్ళు బార్లా చాపి
ఆపుకోన్నవాడు
కాళ్ళు చేతులు చాస్తూనే ఉన్నాడు
నిన్న ఈ రోజు లేదు
కాళ్ళ కిందుగా కదిలి పోయిన మట్టిలో
నేనూ కరిగి పోయాను
*** *** ***
మట్టి - బొగ్గు
మట్టి - ఖనిజం
మట్టి - బాక్సైట్
అడవుల్లోంచి
కొండల్లోంచి
గుట్టల్లోంచి
సొరంగాలు సోరంగాలుగా
డబ్బవుతున్న మట్టి
రాజ్యాలకు రాజ్యాలకు రాజ్యాలే
శాసించ బడుతున్నాయి
డబ్బును తవ్వుకుంటున్న చేతులు
ఎవర్ని లెక్క పెట్టవు
లెక్కించడాని కెవడోచ్చినా
మట్టి లోంచి పుట్టిన తడి
చేతుల్ని తడుపుతుంది
తడిచి గర్భ మవ్వాల్సిన మట్టి
ఎండి బీటలు వారుతోంది
రహదారులవుతున్న మట్టి మీంచి
బువ్వ పెట్టే చారెడు నేల కోసం
తట్ట బుట్టల్లో సర్దు కుంటున్న జీవితాలు
చెట్లకు వేలాడుతున్న బతుకుల్లో
ఎండుటాకుల కలవరం
*** *** ***
ఎవడో
మట్టిని పణంగా పెట్టి
రాజ్యాల్ని కొంటున్నాడు
సువిశాల సామ్రాజ్యాల్ని స్తాపిస్తున్నాడు
ఆకలిని అణగ దొక్కుతున్నాడు
పోడైన జీవితాల్ని తరుముతున్నాడు
అరవై ఏళ్ల క్రితం మారిన రంగు
ఇంకా ఇంకా నలుపెక్కుతోంది
తెలుపైనా నలుపైనా
పాదాల కింద నలుగుతూన్న బతుకులు
వలసలవుతున్నాయి

Saturday, November 14, 2009

కలవడాన్ని గురించి


యధాలాపంగా కలవడం కాదు
దారిన పోతూ తారస పడటం కాదు
ఎవరినో పలకరించబోయి
మరెవరినో పలకరించడం కాదు
నువ్వెవరో తెలియాలి
నీ లోపలి గదుల్లో
మూసి వుంచిన అరల్లోని
రహస్యాల మూటలు విప్పి చెప్పాలి
కలబోసుకోవాలి
కాట్లాడుకోవాలి
కోపాలూ తాపాలూ ఉల్లాసాలూ ఉత్సాహాలూ
అన్నీ బట్టబయలు కావాలి
దేన్ని గురించో మాట్లాడుతూ
లిప్త పాటు నువ్వు ఆగావంటే
చెప్పాల్సిందేదో మిగిగ్లి ఉన్నత్లే
పెదాల మీద చిరునవ్వు
ముఖమంతా విస్తరించలేదంటే
బహిర్గతం కావల్సిందేదో
తెరచాటుకెళ్లినట్లే
నిన్ను నీలోనే మిగుల్చుకొని
ఎదుటివాడికోసం మాటను చాస్తే
మాట మధ్యలోనే విరుగుతుంది
మాటల్ని ఆచితూచి మాట్లాడుతున్నావంటే
ఏవో సంకోచాలున్నట్లే
చెప్పాల్సిది లోపల దాగినప్పుడే
మాటలు నంగి అవుతయి
మాటల నిచ్చెనలు
మాటల వంతెనలు
మాటల ప్రవాహాలూ
నువ్వు దేన్నైనా ఉపయోగించు
తనలో కలిసిపోవాలి
కలిసిపోవడమంటే అట్లా యిట్లా కాదు
నువ్వేంటో తనకి తెలియనంతగా
తనేంటో నీకు తెలియనంతగా
ఒకే శరీరంలోని రెండు అవయవాలన్నంతగా
దేశాలూ
దేహాలూ
మనసులూ
అన్ని అడ్డు గీతల్ని చెరిపేసుకొంటూ
ఏ రాజహంస విడదీయలేనంతగా
కలిసిపోవాలి
---

ఆత్మహత్యల ఋతువు


ఓ నిండు జీవితాన్ని
మధ్యలోనే చిదిమేసుకోవడం
నడుస్తూ నడుస్తూనే
హఠాత్తుగా ఆగిపోవడం
మొదలవ్వకుండనే
విరమించుకోవడం
కొత్త బంగారు లోకాన్ని
సొంతం చేసుకోవాల్సిన చేతులు
అచేతన మవ్వడం
సంతోషాల ఆకాశంలో
దు:ఖ మేఘాలు కమ్ముకోవడం
ఆనంద సాగరాల్లో
కన్నీటి తుపానులు చెలరేగడం
ఆత్మహత్యల ఋతువు ఆగమన సంకేతాలు
***
ఇప్పుడు ప్రతి యింటినీ
పరీక్షల భూతం ఆవహించింది
విజయ లక్ష్యాలు
రాత్రి పగళ్లని ఏకం చేసి
నిన్ను కొద్ది కొద్దిగా నంజుకు తింటుంటాయి
సమాంతర రేఖల్లో
ఏది కొంచెం ముందుకెళ్లినా
నువ్వింకా వేగంగా పరిగెత్తాలి
శరీరాన్ని నిస్సత్తువ కమ్మేస్తున్నా పరిగెత్తాలి
శ్వాస స్తంభిస్తున్నా పరుగు ఆపకూడదు
రేపటి కోసం నేటిని త్యజించాలి
***
మనుష్య యంత్రాల తయారీలో
కార్ఖానాలు విస్తరిల్లుతున్నాయి
నాలుగు గోడల మధ్య
రెండు కళ్లనిండా
పేజీలకు పేజీలు కుక్కుతున్నారు
పసివాళ్ల నవనాడుల్లోంచి
అంకెలు మాత్రమే బయటకు వస్తుంటాయి
సంఖ్యాశాస్త్రం ఒక్కటే
సకల కళల్ని మింగేస్తుంది
అంకెల్ని చూసినప్పుడు కలిగే ఆనందం
శరీర విన్యాసాల్లోను
మాటల వాడకంలోనూ
చేతులు కుంచెలవ్వడంలోనూ కనబడదు
***
శరీరాల్ని శిధిల పరుచుకొంటున్న బిడ్డలారా
కుమిలిపోకండి
కూలిపోకండి
జీవించండి
విస్తరించండి
రహదారుల్నిండా
సేదదీర్చే చెలమలున్నాయి
చెయ్యందించే స్నేహ హస్తాలున్నాయి
ఆత్మహత్యల ఋతువును దాటి
మిమ్ముల్ని మీరు సాకారం చేసుకోండి
*****

కొరివి కారం


గుంటూరు సీమ్మిర్బగాయ దిన్నావా
కొరికిజూడు నసాళానికంటుద్ది
రోషానికి పౌరుషానికి ప్రతీక
ఎర్రగా నిగనిగలాడుతూ కళ్లకింపుగా
అసలా చేను పక్కగా నడుస్తుంటేనే
అదో రకమైన కమ్మని వాసన
నిలువెత్తు బెరిగి యిరగబూసిన
దిష్టి బంతి చెట్ల నడుమ
ండుములెత్తు బెరిగిన మిరపచెట్లు
యిరగ్గాసి వాలిపోయిన కొమ్మల్లోంచి
తెల్ల తెల్లగా పచ్చ పచ్చగా ఎర్రెర్రగా
కాయల్ని జూత్తేనే కడుపు నిండిపోద్ది
కారం లేకుండా యెవురింట్లోనైనా
ఓ పూట గడిచిద్దా
కొరివికారం, గొడ్డుగారం,సాంబారుగారం, పచ్చికారం
అబ్బో యిట్లా చెబుతూ బోతంటేనే
నోటమ్మట నీరుగారతన్నాయిలే
కాని ఏం లాభం
ఆకులు జూసుకొని పిర్రలు కొట్టుకుంటూ
సంబరబట్టమే అయింది
యీళ్ల కళ్లల్లో కారం గొట్ట
మానోళ్లల్లో మట్టిగొట్టిబోతన్నారు
యీళ్ల కి దివసంబెట్ట
కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అయిపోయె
యింతింత రేట్లు బెట్టి
యెరువులు పురుగు మొందులు బోసి పెంచాం గదా
మా కట్టమంతా యీళ్ల యెదాన బోత్తన్నాం
యీళ్ల కొంపల్లో మిరబగాయలు బోసి తగలెయ్య
మా బతుకులు తాలుగాయల బతుకులై పోయాయి
యింతింత జదువుకొని యీళ్లు నేర్చుకొంది
మమ్మల్నెట్లా మోసం జెయ్యాలనే గందా
మా ఉసురు దగలకబోదు
యీళ్ల కొంపల్లో పల్లేరు మొక్కలు మొలవ
యీళ్లు నాశనమవ్వ

***

గుప్పిట్లో భూగోళం


ప్రత్యక్ష సంభాషణల నిరంతర అంతరాయాల మధ్య
ఇప్పుడు అందరం సెల్లో బందీలమయ్యాం
సభోదనా పరకరాలైన పేర్లు
సంఖ్యలు గా మారిపోయాయి
ఆగిపోయిన సంభాషణ
తిరిగి ప్రారంభించాలంటే
తడుముకోవాల్సిందే
విచిత్రంగా ఎవరికి వాళ్లు
మరెవరితోనో మాట్లాడుతూనే ఉంటారు
నిశ్శబ్దాన్ని చీలుస్తూ
శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నవాళ్లంతా
ఏదో పిచ్చి లోకం లో
విహరిస్తున్నట్లుగా ఉంటుంది
ఒకడు పెద్దగా అరుస్తుంటాడు
మరో పదారేళ్లపడుచు
కళ్లల్లో వింతమెరుపుల్తో
ముఖంలో అదోవిధమైన తుళ్లింతల్తో
మెల్లగా ముసిముసిగా
గొణుక్కుంటూ వెళుతుంది
సెల్లు తలలేసుకొన్న వ్యాపారం
నువ్వేసుకొన్నది
ఫాంటైతే ఎ
లుంగీ అయితే బి
నిక్కరైతే సి
అని టైప్ చేసి పంపమంటుంది
భూమికి ఆ వైపునున్న వాళ్లతో
క్షణాల్లో మాట్లాడటం సంతోషమే కానీ
పక్కింట్లోకి కూడా అళాగే మాట్లాడటం విషాదమే
జనారణ్యం లో తప్పిపోయినప్పుడు
దారి చూపించే కుక్కపిల్ల అదే అయినా
తిండి మానేసి కడుపు మాటల్తో నింపుకోమనడం
ఎడతెరిపి లేకుండా
నిరంతరం మాట్లాడుకోమనడం
ముమ్మాటికి నేరమే
సమాచారం ఇంటిల్లిపాదికి
అందేకాలం పోయింది
ఎవరికొచ్చిన సమాచారం వాళ్లే వినాలి
మరికళ్లు ముట్టుకోరు
ముట్టుకోక పోవడమే సభ్యత సంస్కారం
ఇళ్లల్లో సెల్లుగోడలు మొలిచాయి
బయట సొల్లు సంబంధాలు పెరిగాయి
పిల్లల గదుల్లోని రహస్య సంభాషణలు
బొమ్మలు బొమ్మలుగా
ఎక్కడికైనా ఎగిరెళ్లి పోవచ్చు
భూగోళం గుప్పిట్లో యిమిడిందేమో కానీ
జీవితాలు మాత్రం దూరంగా నెట్టేయబడుతున్నాయి.

నగరంలో ఇళ్లూ - నీళ్లూ


నగరం ఈ కొస నుంచీ ఆ కొసదాకా
విస్తరిస్తున్న ఇళ్లు
ఇల్లంటూ ఉంటే కదా తిరిగి వెళ్లేది అన్నాడో కవి
ఇపుడు ఇల్లే సమస్తమైపోయింది
పాతిన రాళ్ల మధ్య
ఇళ్లు మొలుస్తాయో లేదో తెలీదు కానీ
మొలవాల్సిన మొలకలు ఆగిపోయాయి
మూడు కాలాల్లోనూ రక్షించాల్సిన యిళ్లు
రూపాయల మారకాలయ్యాయి
యిళ్లు విస్తరిస్తున్నాయి
యిళ్లతో పాటు వీధులూ విస్తరిస్తున్నాయి
సరికొత్తగా యిప్పుడు నగరంలో
నీళ్లూ విస్తరిస్తున్నాయి
అధాటుగా ఎక్కడ ఓ చెంబెడు నీళ్లు పోసినా
నగరం ఉక్కిరి బిక్కిరవుతోంది
దేహం మొత్తం
సిమెంటుతో తాపడం చేయించుకొన్నాక
రెండు చెమట చుక్కలు బయటకూ రావు
నాలుగు వాన చినుకులు లోపలకూ వెళ్లవు
నీటి రహదారుల్లోనూ
నిలువెత్తు నిలిచిన యిళ్లు
మార్గం తెలీయని నీళ్లు
యిళ్లను ముంచెత్తుతున్నాయి
నగరం నిండుతోంది
ఎప్పుడూ యిళ్లతోనూ
అప్పుడప్పుడూ నీళ్లతోనూ

అసంతృప్తి


నువ్వు నువ్వుగా
జీవించలేక పోవడమంటే
ఒక మనిషిని పోగోట్టుకోవడం
ఒక నిర్మాణాన్ని కూలగొట్టడం
ఒక చెట్టును నిర్మూలించడం
ఒక శూన్యాన్ని ఆహ్వానించడం
ఉండాల్సిందేదో లేకపోవడం
బోసిపోయినట్లుగా ఉండటం
దేన్ని గురించో వెదుకులాడటం
ఎన్ని దొరికినా
దొరకాల్సిందేదో ఒకటి మిగిలిపోవడం
మిగిలిపోయినదాన్ని గురించి
పదేపదే ఆలోచించాల్సిరావడం
ఒక శాశ్వత అసంతృప్తిని
గుండెల్లో నింపుకోవడం

వెంటాడని వాక్యం


లక్షల అక్షరాల్ని ముందుపోసుకు కూర్చున్నా
తొలకరికి ముందు
విత్తనాల కోసం
వేరుశనగ కాయల్ని ఒలిచినట్లు
ఒక్కో అక్షరాన్ని ఒలుచుకుంటూ
విత్తనాల్ని ఏరుకుందామని
పొట్టు పొల్లు తప్ప తాలు - తప్ప
గట్టి విత్తనం ఒక్కటి కనబడదేం
మనసు పొలంలో నాటుకుందామంటే
గుట్టలు గుట్టలుగా అక్షరాలు
దుర్భిణి వేసి వెతికినా కానరాని కవిత్వం
రైళ్లనిండా బస్సులనిండా రహదార్ల నిండా
క్రిక్కిరిసిన వాక్యాలు
ఒక్క వాక్యమూ వెంటరాదేం
సాగిలాపడి నమస్కరిద్దామంటే
అనంతాక్షర సముద్రాల్ని ఈదుతున్న నాకు
మార్గాల్ని సూచించే దీపస్థంభాలు కావాలి
దీపం కాంతిని పంచుతూ మరో దీపాన్ని వెలిగించాలి
పుస్తకమంతా విస్తరించిన అక్షరాల్లోంచి
రాలి పడుతున్న అనుభవాలు
ఏ అనుభవమూ మార్గదర్శి కాదు
***
పిట్టల రెక్కల కింద నుంచో
చెట్ల చిగురుల్లోంచో
సముద్రపు అలల నురగల్లోంచో
ఏవో కొన్ని అక్షరాలు
మనసు పొరల్లోకి జారిపడతాయి
గుండెల్లో భధ్రంగా పదిలపడతాయి
ఆ అక్షరాల కువకువల్లోంచే
నన్ను నేను శుభ్రపరుచుకొని
అడుగులు వేస్తుంటాను.
***

కొన్ని నిర్ వచనాలు


దు:ఖం
జీవితపు అంతర్భాగం
రెండు కన్నీటి చుక్కలే కావచ్చు
కలసిన ఆలోచనల ఓదార్పు
నిన్ను నువ్వు తడితడిగా ఆవిష్కరించుకొంటూ
జీవించడాన్ని గూర్చి ప్రశ్నించిన ప్రతిసారీ
లోపలి పొరల్లోని
దు:ఖపు కణాల మూలుగులు బహిర్గతమవుతాయి
ఘర్షణ
సాహచర్యపు నిరంతర వ్యక్తీకరణ
రెండు మాటలే కావచ్చు
అగాధాల అంచులకు నెట్టే ఆయుధాలు
నిన్ను నువ్వు చీల్చుకొంటూ
కలయికను గూర్చి ఆలోచించిన ప్రతిసారీ
విరిగిన మాటలు పడి లేచిన శబ్దాలు
స్పర్శాచాలనం
ఒకరిలోకి ఒకరు జారిపోయే దేహసంభాషణం
రెండు చేతులే కావచ్చు
గుండెలోయల్లోంచి లాగే చాంతాళ్లు
నున్ను నువ్వు పంచుకొంటూ
దూరాల్ని గురించి మాట్లాడిన ప్రతిసారీ
కరచాలనాల కౌగిలింతలు
పయనం
దేహాన్ని విడిచి
నిరంతరాయంగా సాగే ఆలోచన
రెండు పాదాలే కావచ్చు
అనంతాతి అనంతంగా కదిలే చలనాలు
గమ్యాన్ని గురిపెట్టిన ప్రతిసారీ
చీలిపోతున్న రహదారులు
ఎక్కడో ఓచోట కలవాలి
కరచాలించుకోవాలి
దు:ఖాల ఓదార్పుల్నీ
ఘర్షణల ముగింపుల్నీ
స్పర్శించుకోవాలి
దూరాల గమ్యాల్ని చేరుకోవాలి

కాలమొచ్చింది


కాలమొచ్చింది
నాలుగు చినుకులు కురవకుండానే
బీడు భూముల్లో
రత్నాల రాశుల్ని పండిస్తామని చెప్పే
కాలమొచ్చింది
మాటల్ని నాటితే
మాటలే కదా పండేది
వాడూ
గుప్పిళ్లకొద్దీ
పంట పండని
బిటి మాటల విత్తనాల్ని
లోకం మీద వెద జల్లుతాడు
ఒక వేళ పంట పండినా
అవి పునరుత్పత్తికి పనికి రావు
మళ్లీ వాడి మీదే ఆధార పడాలి
వాడు మాత్రం
పొల్లును చల్లి
గట్టిని రొల్లు కుంటూ ఉంటాడు
వాడు
నిరంతరం హాలో మాటల నిర్మాణాల్ని
వాగ్దానిస్తుంటాడు
ఎన్ని సార్లు నిలబెట్టినా
కూలిపోతూనే ఉంటాయి
అయినా పదే పదే
వాటినే పంచిపెడుతుంటాడు
బ్రతకడాన్ని గూర్చి ప్రశ్నించినప్పుడల్లా
నాలుగు అన్నం ముద్దల్ని
అద్దంలో మనముందుంచుతాడు
వాటిని చూస్తూ మనం గుటకలు మింగాల్సిందే
జలప్రవాహాలతో
మన దేహాల్ని ముంచెత్తుతున్నానని చెప్పి
ధనప్రవాహాల్ని
వాళ్ల భూముల మీదుగా మళ్లిస్తుంటాడు
నాలుగు నీటి చుక్కలు మనకు దక్కినా
చవుడు నేలల్లో
నన్ను నేను మళ్లీ మొలిపించుకోలేను
వాడు వస్తాడు
వీడు పోతాడు
వాడూ పోతాడు
మరొకడు వస్తాడు
ఆయుధాలు మత్తుగా పడివున్నంతకాలం
జీవితం కుప్పపోసినట్లుగా
కదలదు
మెదలదు

నడక కడ్డంగా

ఒక్కోసారి వాడంతే
విస్తరిస్తున్నట్లే కనబడతాడు
నిరంతరం
తనను తాను పెళ్లగించుకొంటూనే
చేతులు చాస్తుంటాడు
చిగుళ్లను చిదిమేస్తూనే
విశాలమవుతుంటాడు
పాదుకట్టి
ఇన్ని నీళ్లు చిలకరించి
ఎదుగుదలకు దోహదం చేస్తుంటానా
కత్తెర్లతో హఠాత్తుగా ప్రత్యక్షమవుతాడు
ఎప్పుడైనా
రెండు విరిగి పోయిన కర్రల్ని అతికించి
వాడి చేతికో ఊతమవుతానా
నడకకడ్డంగా
ఎదుర్రాయి లా నిలుస్తాడు
కళ్లు విప్పార్చి
చూపు సుదూర శుభ్ర విషయాలపై నిలిపి
నన్నూ లోకాన్నీ
రిపేరు చెయ్యడానికి
పనిముట్ల కోసం వెతుకుతుంటానా
అదాటుగా ఎటునుంచి వస్తాడో తెలియదు
ఇసుకరేణువై కంట్లో గుచ్చుకుంటాడు
వాడు ఉన్నత శిఖరాలనందుకొనేందుకు
నామీదగా నడిచి వెళ్లటానికి
నన్ను నేను నిచ్చెనగా మార్చుకుంటానా
వాడు ఓ రంపంతో
నాలోని మెట్లను కోస్తుంటాడు
సుదూర మార్గాల్ని
విశాలం చేసే క్రమంలో
నన్ను నేను రోడ్డు మీద పరుచుకొంటూ
ముందుకెళుతుంటానా
వాడు ఎక్కడో ఓ చోట మందు పాతరై పేలతాడు
ఎప్పుడూ
నడకకడ్డంగా నిలిచే
వాడిని
వేర్లతో సహా పీకేయాలి
తిరిగి తిరిగి మొలవకుండా
తుదముట్టించాలి
... ... ...

వర్తమానం

జీవిస్తున్నవాడు మనిషి
గతంలోనో
భవిష్యత్తులోనో కాదు
వర్తమానం లోనే
జీవించాలి
ఎవర్ని పలకరించినా
ఒకప్పుడు నేనూ.......
నెమరువేస్తాడు
వైభవాల్ని తలచుకొంటూ
వెలిగిపోతాడు
అప్రస్తుతం కాని
ప్రస్తుతాన్నే
ప్రస్తుతించాలిప్పుడు
గతాన్ని తవ్వి తలకెత్తుకొంటేనే
మాసిన తలల మురికి వదిలేది
అయినా
బ్రతుకును వెదుక్కోవాల్సింది
వర్తమానం లోనే కదా
కొన్ని సమష్టి నిన్నల పునాదులమీదే
నేను ఈ రోజు నిలబడ్డాను
అనుభవం కానిదేదీ నేటికి నిలవదు
నిలిచిన దానిలోని
పొల్లును తూర్పార బట్టి
మార్గాల్ని నిర్మించాలి
నిర్మాణాలకు ఎత్తిన రాళ్ల కింద
శిధిలమైన జీవితాల్ని వెదకాలి
వర్తమానపు చేదు
పులిసే కొద్దీ తీపెక్కుతుంది
ఇప్పుడు ఇక్కడ ఇలా బతకడం
అన్ని కాలాలకు విస్తరించడమే
మొదలైతేనే కదా విస్తరించేది
ప్రారంభాన్ని గురించే నా తపనంతా
మొదలుపెట్టు
జీవించడాన్ని
విస్తరించడాన్ని
ఇప్పుడే
ఇక్కడే
మొదలుపెట్టు

వలస పక్షుల గూళ్లు

కొత్తగా మొలుస్తున్న నగరం లోంచి
హఠాత్తుగా అంతెత్తున లేచిన
ఆకాశ హర్మ్యాల లోంచి
జన సంచారం లేని
ఇళ్ళ గుట్టల మధ్య
నేనోక్కడ్ని నిలిచి
విచ్చు కుంటున్న చేతుల కోసం
అన్వేషిస్తున్నాను
ఈ ఖాళీ గూళ్ళల్లో
ఎ వలస పక్షు లొచ్చి చేరతాయో తెలియదు కాని
గూడు కట్టుకొన్న పిట్టలు
పొట్ట చేత పట్టుకొని ఎటో ఎగిరెళ్లి పోయాయి
మా వూరి దాకా నడిచొచ్చిన
నగరం మధ్యలో
మాయిల్లోక దిష్టి బొమ్మ
ఉదయపు నడక నుండి
సాయంత్రపు ఈత వరకు
సకల సౌకర్యాలతో కొలువైన లోగిళ్ళ లో
మాటల సమూహాలే కరువయ్యాయి
అక్కడక్కడా సగం అల్లి వదిలేసిన
గిజిగాడి గూళ్ల లో
పాదముద్రల కోసం వెతుకులాట
ఎ అపరాహ్న వేళో
ఎవరైనా వచ్చి తలుపు తట్టి
దాహం తీర్చ మంటారేమోనని
చెంబేడు నీళ్ళతో నిలబడున్నాను
నా వైపుగా ఏ అడుగు కదలి రాదు
శబ్ద ప్రవాహాలలో ఈదులాడిన నాకు
ఇక్కడి మౌనాలు
నన్ను నాలోకి ఈడ్చు కెళుతున్నాయి
బహిర్గతం కాని సంభాషణల్లో
అందరి తోనో కొందరి తోనో
మాటల గలగలలు ముంచేత్తెదాకా
నిరంతరం మాట్లాడు తూనే ఉంటాను
--- --- ౦౦౦ --- ----

ఆకు రాలిన అడవి

మోసపోవడం
నన్ను నేను మోసగించుకోవడం
నాకు నిత్య కృత్యమైంది.
చరిత్ర పాఠాలు
నా తప్పతడుగుల్ని
ఎత్తి చూపుతున్నా
మళ్లి ఆ బాటలోకే
కాళ్ళు లాగుతుంటాయి
ఏ రహదారుల్లో
ఎన్నిసార్లు
మందు పాతరలై పేలినా
పాతర్లు లెక్కకొస్తున్నాయి కాని
అడుగు ముందుకు కదలడం లేదు
మంజీర నాదాల సాక్షిగా చాపిన చేతుల్లో
మరఫిరంగులున్నాయని
కౌగిలించుకున్న తరవాతే తెలిసింది
నేనేంటో
నా ఆనవాళ్లేన్టో తెలిసిన తరవాత
నిర్మూలించడం చాలా సులభమైంది
అడవి లోంచి అన్ని దారులు
రహదారులతో అనుసంధానమైనాక
ఏ చెట్టు నన్ను దాచుకోలేక పోతోంది
నా లోని ఒక్కో అవయవమూ
నెల రాలుతుంటే
కొత్త నెత్తురు తోడుక్కోవడానికి
ఋతువుల వెంట ఋతువులు మారిపోతున్నాయి
అడవి లోని అన్ని ఋతువులు
శిశిరాలైన తరువాత
తలదాచుకోవడానికి
ఏ చెట్టు తొర్రా ఆశ్రయ మివ్వడం లేదు
దగ్గరున్న ఒక్కో ఆయుధమూ
నిర్విర్యమవుటుంటే
కొత్త ఆయుధాల కోసం అన్వేషణ
తెగిపడుతున్న రెక్కల్ని అంటించుకోవడము
ప్రయాసే అవుతున్నది
---౦౦౦ ----

Friday, November 13, 2009

గాదెలోన కందిపప్పు - గాదె కింద పందికొక్కు

మాంసాహారం అలవాటున్నా
మా యింట్లో నిత్యం పప్పు ఉడకాల్సిందే
అదీ ముద్ద పప్పు
జాది లోని ఆవకాయ తోనో
గోంగూర తోనో
నాలుగు చుక్కలు నెయ్యి తగిలించి
చెయ్యార కలిపి
ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే
బిర్యానీలు పిజ్జాలూ బర్గర్లు ఎందుకు పనికొస్తాయి
అమ్మమ్మ కంది పప్పు తయారు చెయ్యడం కుడా ఒక కళే అంటుంది
వగరోగరుగా చేలో కంది కాయల్ని తెంపుకొని
యింత ఉప్పేసి వుడకబెట్టి తినడటం దగ్గరనుంచి
యింట్లో మెట్టు మీద
కందుల మూటలు పెర్చేదాకా
ప్రతీది ఓ విన్యాసమే
ఆనోపంగా పెరిగిన కంది చేలో
రెండు పనల జ్ఞాపకాల్ని కోసుకొని
మంచు తెరలతో మెత్తబడ్డ
మనసు పొరల్లో ఊరేసుకొంటున్నాను
శీతాకాలపు సూర్యోదయ వేళల్లో
వెచ్చ వెచ్చగా చలి కాగుతూ
కంది పుల్లను నములుతున్నాను
నిన్నటి దాకా
కంది చేను
నా రహస్య జ్ఞాపకాల పేటిక
ఇవాళ చారెడు కందిపప్పు కోసం
రేషన్ షాపు క్యూ లో నిలబడ్డాను
ఒకప్పుడు డబ్బాల నిండా నిలవున్న పప్పులు
ఇవాళ నా చేతి సంచి లో
ఒక మూలకు ఒదిగి పోయాయి
ఎంత ఉడకబెట్టినా ఉడకక
పంటి కింద రాళ్ళయ్యాయి
నా చేలో కాసిన కంది చెట్టు కాయలు
నగరం నడిబొడ్డున
ఎవరికీ కనబడకుండా దాంకున్నాయి
నక్షత్రాలలో నక్షత్రాలై పోయిన
నాలుగు కంది బేడల్ని
గాలించి గాలించి
నా యింటి దాకా లాక్కెళ్లాలి
గాదె లోని కందిపప్పు ను
గాదె కింద పంది కొక్కులు బొక్క కుండా చూడాలి
--- ౦౦౦ --- ౦౦౦ --- ౦౦౦ ---

రేపటిలోకి

వాడు
లేలేతగా
భయం భయంగా
బిత్తర చూపులతో
వద్దికగా
నేను చల్లే విత్తనాల్ని ఏరుకొనేవాడు
ఒక్కోసారిపనికిరాని పోసుకోలు గింజల్ని చల్లినా
ముక్కుతో పొడిచి పొడిచిగట్టి గింజల్నే రొల్లుకొనేవాడు
ఇప్పుడు
వాడు
జేబులో గుప్పెడు విత్తనాల్ని
పోసుకొని లోకం మీదకు బయలుదేరాడు
చీకట్లనే చిమ్ముతాడో
వెలుగు రేఖల్నే పంచుతాడో కాని
ఇప్పుడు మాత్రం
మూర్తీభవించిన విశ్వాసమై నడిచివెళ్లాడు
రేపటిలోకి వాడలా నడిచి వెళ్లడాన్ని చూస్తే
ముచ్చటేస్తుంది
వాడ్ని మొదటి సారి చూసినప్పుడు
రహదారుల్లోని ఎదుర్రాళ్లను తట్టుకొని
ఎలా నడవగలడా అని శంకించాను
కాని వాడునాలోంచి
పుస్తకాల్లోంచినడచి
నడచి రాటుదేలాడు
నాకు తెలుసు
వాడు ఏదో ఒక రోజు
భూమి ఏదీ ఒక మూల నుండి
నాతో మాట్లాడతాడు
నాకు తెలుసువాడు
ఎప్పటికైనామహావృక్షమై తిరిగి వస్తాడు... ... ... ...

దిగులు వర్షం

కూర్చున్న వాడ్ని కూర్చున్నట్లే వుంటాను
దేహం రంగు వెలుస్తూ వుంటుంది
చుట్టూ పరకాయించి చూస్తాను
కొండలూ మట్టీ నీరూ
సమస్తమూ రంగు కోల్పోతూ ఉంటాయి
నా లోలోపల కురుస్తున్న
దిగులు వర్షాన్ని దారి మళ్ళించి
నా ఆప్త మిత్రుడికి ఈమెయిల్ చేస్తాను
కూర్చున్న వాడ్ని కూర్చున్న చోటే వుంటాను
రహదారుల్లోని రాత్రుల్లోకి
చీకటిని ఆహ్వానించి
చెట్ల నీడల్లోన్చి జారిపో తుంటాను
మిత్రుడెవరో ఫోన్ చేసి
ఊరి బయట ఊడల మర్రి కింద
రాత్రిని సిప్ చేస్తూ
చీకటిని నంజు కొంటున్నాను - రమ్మంటాడు
నేను మాత్రం
కూర్చున్న వాడ్ని కూర్చున్న చోటే వుంటాను
అతడు
నా కళ్ళ ముందే
అలా నడిచెళ్లి
ఏదో
కొండ శిఖరం మీద నిలబడి
విజయ గర్వంతో ఊగి పోతుంటాడు
నేను
కాలం వేళ్ళ సందు ల్లోంచి జారి పోతుంటాను
నెల జారిన నేతిని
ఎత్తలేనట్లే
నాలోంచి జారి పోయిన నన్ను
తిరిగి పోగు చెయ్యలేను
నేను మాత్రం
కూర్చున్న వాడ్ని కూర్చున్న చోటే వుంటాను
*** *** *** ***

ఒకానొక వీడ్కోలు కోసం ఎదురుచూపు

అంతా సన్నద్ధం గానే ఉంది
పెట్టేబేడా సర్దుకొని
వెళ్లడానికి సంబధించిన ఉత్సుకతతో
నడవాల్సిన రహదారుల గురించో
మోయాల్సిన
మోయలేని బరువుల గురించో
మనసు
పికుతూ ఉంటుంది
కిటికీ లోంచి తల బయటకు పెట్టి
వేలగాల్సిన పచ్చ లైటు గురించి ఆలోచిస్తూ
పొడి పొడి గా
అతికి అతకని మాటలతో
అంతా సన్నద్ధం గానే ఉంది
*** **** ***
ఒకానొక వీడ్కోలు కోసం
సర్దాల్సిందంతా సర్దేసి
చెప్పాల్సినవన్ని చెప్పేసి
చివరి కదలిక కోసం ఎదురు చూస్తూ
మనసులోని మాటలన్నీ ఖాళీ అయిపోయాక
ఒకానొక శూన్యం కాని శూన్యాన్ని నింపుకొని
చిట్ట చివరి ఒకే ఒక్క మాట చెప్పడం కోసం
ఒక చిన్న అసహనంతో
కిటికీ లోపలి తలపెట్టి
*** **** ***
ప్రయాణం సాగారిన వెంటనే
ఒక్కసారిగా మాటల గలగలలు
చిట్ట చివరి మాటల ప్రవాహాలు
మళ్లి కలవడానికి పట్టే కాలాన్ని కొలుస్తూ
ఒక చిన్న ఉప్పెన
*** **** ***
గమ్యం ఏదైనా
ప్రయాణాలన్నీఅక్కడే మొదలవుతాయి
శరీరాల్ని తరలించాల్సి వచ్చిన
చివరి మలుపులోనూ
వీడ్కోలు కోసం అదే ఎదురు చూపు
గాజుకళ్ళ లోంచి జారే
ఒక్కో నీటి బొట్టు
ప్రయాణించాల్సిన దూరాన్ని చేరిపెస్తుంటే
గమ్యం అస్పష్టమై
నడక తూలి పోతున్నప్పుడు
మరణాన్ని ఆహ్వానిస్తూ
మళ్లి అదే ఎదురు చూపు
అక్కడా ఒక చిన్న అసహనం
అంతా సన్నద్ధమైనాక
నిర్జీవ దేహాల్ని తరలిస్తుంటే
అప్పటి దాకా స్థబ్దుగా ఉన్న చోట
కొన్ని మాటలు
మరికొన్ని జ్ఞాపకాలు
ఇంకొన్ని చరిత్రలు
చిట్ట చివరి మాటల వీడ్కోలు
**** **** ***

కొన్ని మరణాల్లోంచి

మరణాల్ని కీర్తించడం కొత్తేమీ కాదు
మణికర్ణికా ఘాట్ లో
రగిలే ఆరని చితిమంటల్లో
నిత్యం నన్ను నేను దహించుకొంటున్న వాడ్నే
చరిత్ర లో స్వర్ణయుగాలంటూ ఉండవు
రాజు దైవాంశ సంభూతుడూ కాదు
పాలించే వాడెవడైనా
పద ఘట్టనల క్రింద నలిగిన ఆత్మలు
మౌనంగా రోదిస్తూనే ఉంటాయి
చార్ మినార్ ల సాక్షిగా
ఆకాశంలో నిలబడి
జరుగుతున్న తంతును వీక్షిస్తూనే ఉంటాయి
నన్ను నేను మొలకెత్తించుకొంటున్న
చారెడు నేల పై మోపిన
రాక్షస పాదపు జాడలు
మనసులోంచి తొలగిపోలేదు
పురుగుల మందు సేవిస్తూనో
దూలానికి వేలాడుతూనో
నన్ను ఆక్రమించిన పాదాలను మోస్తున్న
బోయీలను గమనిస్తూనే ఉన్నాను
పెదాల చిరునవ్వులపై విరిసిన
కత్తుల్ని ఆస్వాదించిన వాడ్ని
నువ్వు నడిచెళ్లిన దారుల్లో
తెగిపడిన శిరస్సుల్ని
పోగు చేసుకొంటున్న వాడ్ని
తారీఖులు దస్తావేజులతో పనిలేని
యుద్ధాలలో చెల్లాచెదరైన వాడ్ని
నువ్వు విసిరిన ఎంగిలి మెతుకులే
పరమాన్నంగా భావించి
నీ ముందు మోకరిల్లిన వాడ్ని
ఇప్పుడు
మళ్ళీ
నా మరణంలోంచి
కొత్తగా మాట్లాడుతున్నాను
అడవులో వాగులో వంకలో
ఏవైతేనేం
నేను తిరిగి పచ్చగా చిగురించి
జనంలోకి ప్రవహించడానికి
ప్రవాహం గమనాన్ని మార్చుకొన్నా
ఎప్పటికైనా దాని లక్ష్యం జనాన్ని చేరడమే
నేను ఎన్ని సార్లు మరణించినా
తిరిగి తిరిగి మొలుస్తూనే ఉంటాను
శ్మశాన వైరాగ్యాన్ని ఆలపించను
మట్టికోసం
మనిషి కోసం
నిరంతరం పరిగెడుతూనే ఉంటాను