Wednesday, July 21, 2010

పురా శకలం


పురాతన శకలాల కోసం
అక్షరాల్ని తవ్వు
గాయపడ్డ అక్షరాల్లో
ఏదో ఒకటి
తన గుండెను ఒలుచుకొని
నీలోకి ప్రవహిస్తుంది
ప్రవహించిన అక్షరాల్ని
ప్రేమగా పొడవుకొని
అక్కున చేర్చుకో
ప్రతిబింబమై
నీ ఎదురుగా నిలుస్తుంది
నీతో నువ్వు
సంభాషించే ప్రతి మాటా
ఒక పురా శకలమై
మనసు లోతుల్లో
యింకి పోతుంది
ఓ వానా కాలపు రాత్రి
శరీరం పై
తప్పక చెమ్మ దేరుతుంది
అది స్వేదం కాదు స్పృహ
తేమ కాదు స్పర్శ

Wednesday, July 14, 2010

నా దేశపు నాలుగో స్తంభం


గుండె చేతబట్టుకొని
అత్యంత ఉత్కంఠతో
ప్రాణాలుగ్గబట్టుకొని
ఒకానొక అంతర్యుద్ధాన్ని
కళ్లారా వీక్షిస్తున్నాను
* * * *
వ్యాఖ్యలొద్దు
ఊహాగానాలూ వద్దు
మాటల్ని నిలువునా చీల్చి చెప్పే
వాటి వెనుక మర్మాల్ని
ఎవరూ బట్ట బయలు చెయ్యనవసరం లేదు
వక్రోక్తులూ వ్యంగ్యోక్తులూ
అలంకారాలేమో కాని
నీకు నా జీవితమే వ్యంగ్యమైపోయింది
సమాజం మెరుగవ్వడం కోసం
నువ్వు కూల్చే వాస్తవాల గోడల మధ్య
నిప్పులాంటి నిజాల్ని కాల్చి
బూడిద మిగులుస్తున్నావు
ప్రతి క్షణం దమ్ము తోనో ధైర్యం తోనో
అందించే సమాచారం లో
నిజం పాలెంత
చీకటంటే నల్లగా మాత్రమే ఉంటుందని తెలుసు
చీకటికి రంగులు పులుముతున్న దృశ్యాన్ని చూస్తున్నాను
సరిహద్దుల కటూ యిటు
నిరంతర సంఘర్షణ
తెరమీది నాటకానికి వెనుక
వ్యూహ ప్రతివ్యూహాలు
ఇంట్లో రంగుల డబ్బాలో జరిగే
మాటల యుద్ధాన్ని మోస్తున్నవాడ్ని
ఎప్పటికీ హంసను కాలేను
* * * *
నా దేశపు నాలుగో స్తంభానికిప్పుడు చీడ పట్టింది
మాటలే మాటల్ని హత్య చేస్తున్న వేళ
మాట సూటిదనాన్ని కోల్పోయింది
ముఖానికేసుకొన్న రంగుల్లో
మాటలు దాక్కుంటున్నాయి
అసలు మాట
అక్కడ ఉండగానే
మాటల నీడలు ఎల్లలు దాటుతున్నాయి
తెర మీద చేసుకొనే ఉత్తుత్తి యుద్ధాలకు
బలవుతున్న వాడ్ని
నిర్మించబడుతున్న నిజాల మధ్య
ప్రాణ విలువ వార్త కంటే తక్కువై పోయింది
నీ రేటింగ్ సూచికి వేళాడుతూ
నేను పోగొట్టుకొన్న ప్రాణం
నీకొక రోజు పతాక శీర్షిక
రేపటికది పకోడి పొట్లం
నాకిప్పుడు నిజం కావాలి
సూటిగా చెప్పే మాట కావాలి
మాట వలన లోకం వర్ధిల్లాలి
* * * *

Sunday, April 11, 2010

కురవని చినుకు కోసం

కురవని చినుకు కోసం
కురవని చినుకు అంచున
తలక్రిందులుగా నిలబడి నిరీక్షిస్తున్నాను
చినుకు నుండి జారి భూమిలో యింకిపోవాలని
ఏ కార్తె చినుకూ నన్ను క్రిందికి జార్చడంలేదు
ఆషాఢ మాసాన మెరవాల్సిన మేఘాలు
మబ్బుల్లో మాయమై పోయాయి
చాళ్ల వెంబడి విచ్చుకోవాల్సిన
విత్తనం గర్భంలో
ఘనీభవించిన మొలకల కదలికలు
రెండు నీటి చుక్కల కోసం
పొడిబారిన మట్టిపెళ్ళల్లోంచి తొంగిచూస్తున్నాను
ఇక్కడ కురవాల్సిన మేఘపు జాడకోసం
దాహం తీరే దారి లేక
నోరు పిడచగట్టుకుపోతోంది
యజ్ఞాలే చేస్తారో
కృత్రిమ వానలే కురిపిస్తారో
నా ముఖాన నాలుగు చెంబులు
నీళ్లు కుమ్మరించిపోండి
తడి తడిగా మట్టిలోంచి విచ్చుకోవాలనుంది
కొంచెం చెమ్మ తగిలినా చాలు
రెండు చేతులు జోడించి మీముందు నిల్చుంటా.

ఒంటరి సమూహం

1
ముఖాలు రకరకాల ముఖాలు
షాపింగ్ మాల్స్ లోనూ బీసెంట్ రోడ్డు లోనూ
ఒకరినొకరు ఒరుసుకొంటూ నడిచే ముఖాలు
2
ఒకడు
నిర్లిప్తంగా
నిస్తేజంగా
ప్రపంచం లోని దైన్యాన్నంతటిని
ముఖానికి పూసుకొని
జీవించడం లోని భారాన్ని మోస్తూ
3
ఆమె
ఉత్సాహం గా
ఉత్తేజం గా
ఉరకలు వేస్తూ
దేన్నైనా తనలో కలుపుకు పోయే
ప్రవాహ వేగం తో
4
ముఖాలకు తొడుగుల్ని ధరించడం కూడా
అంత సులువైనదేం కాదు
కొన్ని క్షణికమైనవి
మరికొన్ని శాశ్వతమైనవి
5
వాడి ముఖానికి
ఎన్ని సార్లు కొత్త తొడుగు తొడిగినా
క్షణాల్లోనే మాసిపోతుంది
6
తొడుగుల్ని ఒలిచినాక
అదృశ్యమైన మనిషి గురించే
తపనంతా
7
నిజానికి
మనిషి కంటే
అద్భుతమైనదేదీ కనిపించదు
అద్భుతాల్ని సృష్టించే వాడు కదా
8
చూస్తూ వుండు
వాడిని అలాగే చూస్తూ వుండు
ఎన్ని అద్భుతాలుగా మారతాడో
9
వెలుపలి అరణ్యాల్నీ
లోపలి మృగాల్నీ
తరుముకుంటూ వెళ్లు
అదృశ్యమైన మనిషి
ప్రత్యక్షమవుతాడేమో
10
ఆ మూల మలుపులో
అక్కడే నిలబడి
కదులుతున్న మనుషుల్ని స్కాన్ చెయ్యి
బాల్యం లోనే నీనుంచి పారిపోయిన వాడు
ఊరి చెరువులో
దిగంబరంగా ఈతేసినప్పుడు
పట్టుకున్న జలగల్లో ఒకటైన వాడు
పుస్తకాల్లో దాచుకొన్న నెమలీక కోసం
నెమళ్లనే వేటాడిన వాడు
దొరక్క పోడు.

శూన్య దేహం

ఇక్కడ నేనొక శూన్యాన్ని ఒలకబోస్తున్నాను
జారిపోతున్న శూన్యం లోంచి
ఖాళీలు ఖాళీలు గా నువ్వు నేను
శూన్యానికి మాట్లు వేసైనా
నిన్ను నువ్వు నింపుకోవానుకొంటావు
నింపడం ఎప్పుడూ మరోక ఖాళీకి చిహ్నం కదా
ఖాళీలను నింపే మనుషుల కోసం
ప్రకటనలిస్తుంటాను
ప్రకటనల్లోంచి నడిచొచ్చిన ప్రతి ఒక్కడూ
నాలోని నన్ను
గుప్పెళ్లతో ఎత్తుకెళుతూ
నన్ను మరింత ఖాళీ చేస్తుంటారు
జీవితపు రహదారుల్లో
ఓటి చప్పుళ్ళతో
వేలాడుతున్న నాకు
ఇంత నమ్మకాన్ని పోయండి
దోసిళ్లతో నన్ను నేను నింపుకొంటాను
ఒలికిన శూన్యం లోంచి
తొంగి చూస్తున్న నన్ను
బహిరంగ పరచండి
వివస్త్ర శరీరం తో మీలోకి జారిపోతాను
నన్ను గురించిన ప్రశ్నలకు
జవాబు వెతికే వేళ
నువ్వు ఎక్కడో ఒక చోట
ఎదురు పడక పోవు
అయినా
నింపేందుకు తీసుకు రావాల్సిన దాన్ని గురించి
ప్రశ్నిస్తూనే ఉంటాను
చేలను పంటలతోనూ
ఇళ్లను మనుషులతోనూ
నింపాలనుకొన్న నాకు
ఇప్పుడు వస్తువు లెదురవు తున్నాయి
నన్ను నా దేహాన్ని ఖాళీ చేసుకొని
తిరిగి తిరిగి
వస్తువులతో నింపుకొంటున్నాను
మనుషులకు జాగా దొరకని శరీరానికి
టు లెట్ బోర్డు తగిలించాను
ఎవరు వచ్చి
నింపుతారో
ఎదురు చూస్తుంటాను.

Monday, February 15, 2010

కథా వసంతం - కథల పోటి
అనూస్ హాస్టల్స్ & ఆదివారం ఆంధ్ర జ్యోతి సంయుక్త నిర్వహణలో
అక్షరాల లక్ష రూపాయల బహుమతులు
పది ఉత్తమ కథలకు ఒక్కో కథకు పదివేల రూపాయలు
వివరాలకు 21 - 2 - 2010 ఆదివారం ఆంధ్ర జ్యోతి చూడండి.