Wednesday, July 14, 2010

నా దేశపు నాలుగో స్తంభం


గుండె చేతబట్టుకొని
అత్యంత ఉత్కంఠతో
ప్రాణాలుగ్గబట్టుకొని
ఒకానొక అంతర్యుద్ధాన్ని
కళ్లారా వీక్షిస్తున్నాను
* * * *
వ్యాఖ్యలొద్దు
ఊహాగానాలూ వద్దు
మాటల్ని నిలువునా చీల్చి చెప్పే
వాటి వెనుక మర్మాల్ని
ఎవరూ బట్ట బయలు చెయ్యనవసరం లేదు
వక్రోక్తులూ వ్యంగ్యోక్తులూ
అలంకారాలేమో కాని
నీకు నా జీవితమే వ్యంగ్యమైపోయింది
సమాజం మెరుగవ్వడం కోసం
నువ్వు కూల్చే వాస్తవాల గోడల మధ్య
నిప్పులాంటి నిజాల్ని కాల్చి
బూడిద మిగులుస్తున్నావు
ప్రతి క్షణం దమ్ము తోనో ధైర్యం తోనో
అందించే సమాచారం లో
నిజం పాలెంత
చీకటంటే నల్లగా మాత్రమే ఉంటుందని తెలుసు
చీకటికి రంగులు పులుముతున్న దృశ్యాన్ని చూస్తున్నాను
సరిహద్దుల కటూ యిటు
నిరంతర సంఘర్షణ
తెరమీది నాటకానికి వెనుక
వ్యూహ ప్రతివ్యూహాలు
ఇంట్లో రంగుల డబ్బాలో జరిగే
మాటల యుద్ధాన్ని మోస్తున్నవాడ్ని
ఎప్పటికీ హంసను కాలేను
* * * *
నా దేశపు నాలుగో స్తంభానికిప్పుడు చీడ పట్టింది
మాటలే మాటల్ని హత్య చేస్తున్న వేళ
మాట సూటిదనాన్ని కోల్పోయింది
ముఖానికేసుకొన్న రంగుల్లో
మాటలు దాక్కుంటున్నాయి
అసలు మాట
అక్కడ ఉండగానే
మాటల నీడలు ఎల్లలు దాటుతున్నాయి
తెర మీద చేసుకొనే ఉత్తుత్తి యుద్ధాలకు
బలవుతున్న వాడ్ని
నిర్మించబడుతున్న నిజాల మధ్య
ప్రాణ విలువ వార్త కంటే తక్కువై పోయింది
నీ రేటింగ్ సూచికి వేళాడుతూ
నేను పోగొట్టుకొన్న ప్రాణం
నీకొక రోజు పతాక శీర్షిక
రేపటికది పకోడి పొట్లం
నాకిప్పుడు నిజం కావాలి
సూటిగా చెప్పే మాట కావాలి
మాట వలన లోకం వర్ధిల్లాలి
* * * *

1 comment:

  1. మీ ఆవేదనలో అర్థముంది. కొంతలో కొంత నిజమూ ఉంది. కవిత బాగా వచ్చింది.
    అంటే వ్యవస్థ మొత్తం అలా ఉన్నట్టు కాదు.
    అన్నింటిలోనూ మంచి, చెడు రెండూ ఉన్నాయి. రాజకీయాలు, బ్యూరోక్రసీ, పోలీసు వ్యవస్థ, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు ఇలా అన్నింటిలోనూ రెండు రకాల వారు ఉన్నారు. కీచక గురువులు, లంచగొండి అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు, అక్రమాలకు గొడుగుపట్టే పోలీసులు అడుగడుగునా కనిపిస్తారు.
    ముందు చెప్పినట్టు అన్ని రంగాల్లో ఈ షేడ్స్ కనిపిస్తాయి.
    మంచిని వెతుక్కుంటూ వెళ్లడమే మన పని. :)

    ReplyDelete