Friday, November 13, 2009

కొన్ని మరణాల్లోంచి

మరణాల్ని కీర్తించడం కొత్తేమీ కాదు
మణికర్ణికా ఘాట్ లో
రగిలే ఆరని చితిమంటల్లో
నిత్యం నన్ను నేను దహించుకొంటున్న వాడ్నే
చరిత్ర లో స్వర్ణయుగాలంటూ ఉండవు
రాజు దైవాంశ సంభూతుడూ కాదు
పాలించే వాడెవడైనా
పద ఘట్టనల క్రింద నలిగిన ఆత్మలు
మౌనంగా రోదిస్తూనే ఉంటాయి
చార్ మినార్ ల సాక్షిగా
ఆకాశంలో నిలబడి
జరుగుతున్న తంతును వీక్షిస్తూనే ఉంటాయి
నన్ను నేను మొలకెత్తించుకొంటున్న
చారెడు నేల పై మోపిన
రాక్షస పాదపు జాడలు
మనసులోంచి తొలగిపోలేదు
పురుగుల మందు సేవిస్తూనో
దూలానికి వేలాడుతూనో
నన్ను ఆక్రమించిన పాదాలను మోస్తున్న
బోయీలను గమనిస్తూనే ఉన్నాను
పెదాల చిరునవ్వులపై విరిసిన
కత్తుల్ని ఆస్వాదించిన వాడ్ని
నువ్వు నడిచెళ్లిన దారుల్లో
తెగిపడిన శిరస్సుల్ని
పోగు చేసుకొంటున్న వాడ్ని
తారీఖులు దస్తావేజులతో పనిలేని
యుద్ధాలలో చెల్లాచెదరైన వాడ్ని
నువ్వు విసిరిన ఎంగిలి మెతుకులే
పరమాన్నంగా భావించి
నీ ముందు మోకరిల్లిన వాడ్ని
ఇప్పుడు
మళ్ళీ
నా మరణంలోంచి
కొత్తగా మాట్లాడుతున్నాను
అడవులో వాగులో వంకలో
ఏవైతేనేం
నేను తిరిగి పచ్చగా చిగురించి
జనంలోకి ప్రవహించడానికి
ప్రవాహం గమనాన్ని మార్చుకొన్నా
ఎప్పటికైనా దాని లక్ష్యం జనాన్ని చేరడమే
నేను ఎన్ని సార్లు మరణించినా
తిరిగి తిరిగి మొలుస్తూనే ఉంటాను
శ్మశాన వైరాగ్యాన్ని ఆలపించను
మట్టికోసం
మనిషి కోసం
నిరంతరం పరిగెడుతూనే ఉంటాను

No comments:

Post a Comment